అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు – Telangana Double Bedrooms
అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
600 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి
నిర్మల్, జూన్ 17:పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణ వాసుల కోసం సిద్ధాపూర్ లో రూ.31.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తామన్నారు. స్వరాష్ట్రంలో ప్రతి పేదవాడు రెండు పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో దర్జాగా కాలుమీద కాలేసుకుని బతకాలన్న సీఎం కేసీఆర్ మహోన్నత ఆశయం మేరకే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు.
నిర్మల్ పట్టణ వాసులు కోసం 2100 ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. సీయం కేసీఆర్ నిర్ణయం మేరకు స్వంత జాగా ఉన్న వారు స్వయంగా వారే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. సీయం నిర్ణయం మేరకు మార్గదర్శకాలు విడుదల చేస్తారని పేర్కొన్నారు.
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాంటించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడ అభివృద్ధి పనులు ఆగలేదని, సంక్షేమ పథకాలకు నిధులు మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేస్తున్న ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులకు రైతుబంధు, వృద్దులు, వితంతువులు, వికాలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఫించన్లు అందజేస్తున్నామని, కొత్త రెవెన్యూ చట్టంతో భూతగదాలకు స్వస్తి పలికామని తెలిపారు. సాగు, సాగు నీటి కష్టాలు తీరినాయని, కరెంట్ కోతలు లేవని స్పష్టం చేశారు. ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీయం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన, మైనార్టీ, ఇలా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. త్వరలోనే అర్హులైన వారికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని హమీనిచ్చారు.